కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలను, పన్నుల భారాన్ని ప్రజలపై గుదిబండగా మారాయని దీనిపై ప్రజల బాధ తీర్చాలని 9న చలో అమరావతి నిర్వహిస్తుంటే జిల్లాలో ముందుస్తు అరెస్టులు చేయడం దారుణమని సిపిఐ నేత తాటిపాక మధు అన్నారు. ఈ నెల 9న సిపిఐ చలో అమరావతికి పిలుపునిస్తే ఒకరోజు ముందు నుండే పోలీసులు ముందస్తు అరెస్టులకు సిద్ధపడ్డారు. అధిక ధరలను అరికట్టలేని వైసీపీ ప్రభుత్వం సిపిఐ, ప్రజా సంఘాల నేతలకు నోటీసులు ఇవ్వటం, అరెస్టులు చేయడం దుర్మార్గం అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పెంచిన ఆస్తి, చెత్త పన్నులను విరమించుకోవాలని కోరారు. వంట నూనెల, నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై అధిక సుంకాల భారాన్ని తగ్గించాలని కోరారు. అరెస్టు చేసిన సిపిఐ నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.