రాష్ట్ర ప్రభుత్వ నాన్చుడి ధోరణి వల్ల పేదల సొంతింటి కల కల్లగానే మిగిలిపోయేలా ఉందని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు రాజమండ్రిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. తమ తెలుగుదేశం పార్టీ హయాంలో షేర్ వాల్ టెక్నాలజీతో అందంగా నిర్మించిన లక్షలాది టిడ్కో గృహాలు గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు తొలగించి అర్హులకు వాటిని ఎందుకు ఇవ్వలేకపోతోందని ప్రశ్నించారు. కళ్లెదుటే గృహ సముదాయాలు ఏళ్లుగా ఊరిస్తూనే ఉన్నాయని, జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా అదిగో ఇస్తాం. ఇదిగో ఇచ్చేస్తున్నాం అంటున్నారే తప్ప అర్హుల చేతికి తాళాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. టిడ్కో ఇళ్లకు సంబంధించి అర్హుల నుంచి బ్యాంకు వారు నెల వారీ వాయిదాలు చెల్లించుకుంటున్నారని, దీంతో పేద ప్రజలు ఇటు అద్దెలు, అతు బ్యాంకులకు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి టిట్కో లబ్ధిదారులకు ఇళ్లను అందజేయాలని డిమాండ్ చేశారు.