Womens Cricket World Cup ఫైనల్ మ్యాచ్‌కు రిఫరీగా రాజమండ్రి మహిళ.. అరుదైన అవకాశం

Womens Cricket World Cup ఫైనల్ మ్యాచ్‌కు రిఫరీగా రాజమండ్రి మహిళ.. అరుదైన అవకాశం

ఉమెన్స్ వరల్డ్ కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌‌కు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన గడికోట సర్వ లక్ష్మీ రిఫరీగా ఎంపియ్యారు. ఇప్పటికే పురుషుల క్రికెట్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించి రికార్డు క్రియేట్ చేసిన లక్ష్మీ.. ఈసారి మహిళల ప్రపంచ కప్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించబోతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ ప్యానెల్‌‌లో తొలి మహిళగా నియమితులై గతంలో చరిత్ర స‌ృష్టించిన విషయం తెలిసిందే.

1968లో జీఎస్ లక్ష్మీ రాజమండ్రిలో జన్మించారు. తండ్రి జంషెడ్‌పూర్ టాటా కంపెనీలో పనిచేస్తున్నందున అక్కడే పెరిగారు. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్న ఆమెకు ఆల్‌రౌండర్‌గా పేరుంది. రైట్ హ్యాండ్ బ్యాంటింగ్ చేయడంతో ఫాస్ట్ మీడియం బౌలింగ్ చేస్తారు. 1989లో ద.మ. రైల్వేలో ఉద్యోగం సాధించిన లక్ష్మీ.. సౌత్ సెంట్రల్‌ రైల్వేస్‌ జట్టుకు ఆడారు. అంతేకాకుడా ఆంధ్రా ఉమెన్, బీహర్ ఉమెన్, రైల్వేస్ ఉమెన్, ఈస్ట్ జోన్ ఉమెన్, సౌత్ జోన్ ఉమెన్ జట్లకు ఆడారు. 1999 టీమిండియా ఉమెన్స్ టీమ్ ఇంగ్లండ్‌కు ఎంపికైనా.. ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు. 2004లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తరువాత సౌత్ సెంట్రల్‌ రైల్వేస్‌ జట్టుకు కోచ్‌గా పనిచేశారు.

క్రికెట్‌లో లింగభేదం తగ్గించడంతోపాటు అందరూ సమానం అనే భావన కల్పించేందుకు మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఆసీస్-ఇంగ్లాండ్ ఉమెన్స్ వరల్డ్ కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌కు పనిచేస్తున్న 15 మందిలో 8 మంది మహిళలే ఉండబోతున్నారు. ఈ మ్యాచ్‌ కోసం నలుగురు మహిళలను రిఫరీలుగా ఎంపికచేశారు. ఈ నలుగురిలో జీఎస్ లక్ష్మీకి చోటుదక్కింది. 2020లో యూఏఈలో జరిగిన పురుషుల లీగ్ మ్యాచ్‌లకు ఆమె రిఫరీగా వ్యవహరించారు.

కాగా.. ఎన్నో అంచనాల నడుమ ఈ వరల్డ్ కప్‌లో అడుగుపెట్టిన భారత మహిళల జట్టు గ్రూప్‌లో దశలోనే వెనుదిరిగింది. ఏడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించిన మిథాలీ సేన.. తప్పక గెలవాల్సిన చివరి మ్యాచ్‌లో బౌలింగ్ వైఫల్యంతో వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. 2017 రన్నరప్‌గా నిలిచిన టీమిండియా.. ఈసారి లీగ్ దశలోనే వెనుదిరగడంతో క్రికెట్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.
Rate this post