గోదావరిలో పాపికొండలు వెళ్ళే బోట్ బోల్తా : 12 మంది మృతి!

దేవీపట్నం: తూర్పుగోదావరి జిల్లా కచులూరు మందం దగ్గర గోదావరిలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదం విషాదాంతమైంది. బోటులో పాపికొండల పర్యాటకానికి వెళ్లిన వారిలో ఇప్పటి వరకు 12 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. మరో 24 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నట్లు సమాచారం. పర్యాటక శాఖ అనుమతిలేని రాయల్‌ వశిష్ఠ ప్రైవేటు బోటు వల్లే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సహాయక బృందాలు ఇప్పటి వరకు 7 మృతదేహాలను వెలికితీశాయి. సురక్షితంగా ఒడ్డుకు చేరిన వారిలో 16 మందిని రంపచోడవరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

లైఫ్‌ జాకెట్లు వేసినవారిలో 14 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. లైఫ్‌జాకెట్లు వేసిన వారిని తూటుగుంట గ్రామస్థులు పడవల్లో వెళ్లి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఉదయం 10.30 తర్వాత ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
బోటుకు అనుమతి ఎలా ఇచ్చారు..?
నిన్నటి వరకు గోదావరిలో 5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. ఇంత వరద ఉద్ధృతి ఉంటే బోటుకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రత్యక్షసాక్షులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే జిల్లా, స్థానిక అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుంటున్నారు. అధికారులంతా దేవీపట్నం చేరుకుని అక్కడి నుంచి ఘటనాస్థలానికి వెళ్లాల్సి ఉంది.

Rate this post