Govt Hospital: రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో స్పెషాలిటీ సేవలు

ఈనెల 13వ తేదీ నుంచి రాజమండ్రి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో సూపర్‌స్పెషాలిటీ ఓపీ వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకూ ప్రభుత్వాసుపత్రిలో సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో ఉండనున్నారు. కాగా రాజమండ్రి ఐఎంఏ సహకారంతో డెల్టా ఆసుపత్రికి చెందిన సూపర్‌స్పెషాలిటీ వైద్యులు ఇక్కడ ఓపీ సేవలు అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.


సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తేవాలని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రులు స్పెషలిస్టులు ఈరోజు నుంచి అందుబాటులో తీసుకొస్తున్నామని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవిలత తెలిపారు. 

సోమవారం రాజమండ్రి జిల్లా ఆస్పత్రి లో సూపర్ స్పెషాలిటీ ఓ పి విభాగాన్ని శాసనసభ్యులు జక్కంపూడి రాజా, ఆస్పత్రి వైద్యులు, వైద్య సిబ్బంది తో కలిసి కలెక్టర్ డా. మాధవీలత ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ప్రజలకు డాక్టర్ల సేవలు దగ్గరకు చేయాలని లక్ష్యంతో ప్రైవేట్ ఆసుపత్రుల సూపర్ స్పెషాలిటీ వైద్యులతో మాట్లాడి వారంలో ఆరు రోజులు పాటు సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఆయా విభాగాలకు చెందిన సూపర్ స్పెషాలిటీ వైద్యులు అవుట్ పేషెంట్లుకి వైద్య సేవలు అందిస్తారన్నారు. తూర్పు గోదావరి జిల్లా నలుమూలల నుంచి ప్రతి నిత్యం ప్రజలు వైద్య సేవలు కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరుగుతోందన్నారు. ఈ విషయంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లతో మాట్లాడడం జరిగిందని, నూతనంగా ఏర్పడిన తూర్పు గోదావరి జిల్లా లోని ప్రజలకు రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు అందించేందుకు వారు సుముఖత వ్యక్తం చేశారని కలెక్టర్ తెలిపారు. జిల్లా యంత్రాంగం తో ప్రజల ఆరోగ్యం కోసం ముందుకు రావడం వారి ప్రవేటు ప్రాక్టీసును కూడా వదులుకొని ప్రతిరోజు రెండు గంటల పాటు వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సమకూర్చుకున్న అత్యాధునిక వైద్య పరికరాలను వినియోగించి ప్రభుత్వాసుపత్రికి వోచ్చే రోగులకు సేవలందించాలని కోరామన్నారు. ఈ తరహా వైద్య సేవలను భవిష్యత్తులో కూడా కొనసాగించేలాగా చర్యలు తీసుకుంటామని మాధవీలత తెలిపారు. కార్యక్రమంలో డి ఎమ్ & హెచ్ ఓ డా. ఆర్ స్వర్ణలత, డి సి హెచ్ డాక్టర్ సనత్ కుమార్ హాస్పటల్ సూపరిండెంట్ డాక్టర్ బి. ఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Rate this post